ఉపోద్ఘాతము
వేదము మానవుల ఉన్నతి కోసము కర్మ మార్గము, జ్ఞానమార్గముఅని రెండు మార్గములను చూపుచున్నది. అందులో కర్మమార్గము ద్వారా ఐహిక, ఆముష్మిక (అంటే పైలోకముల) సుఖములను మానవులు పొందవచ్చును. జ్ఞానమార్గము మోక్షమునకు సోపానము.
సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు యజ్ఞయాగాదికర్మమార్గమునును బోధించునవి కాగా ఉపనిషత్తులు మాత్రము జ్ఞానమార్గమునుబోధించునవి. వీటికే వేదాంతము, బ్రహ్మవిద్యఅని పేర్లు కూడా వున్నాయి.
బ్రహ్మ తత్త్వమును బోధించు వేదాంతదర్శనములోప్రస్థానత్రయముగా (మూడు మార్గములుగా) కీర్తించబడే ఉద్గ్రంథములు-ఉపనిషత్తులు, శ్రీవేదవ్యాస భగవానునిచే గ్రథితమైన బ్రహ్మసూత్రములు, శ్రీకృష్ణ భగవానునిచేత అర్జునునికి బోధింపబడినది శ్రీమద్భగవద్గీత. వీటిలోఉపనిషత్తులు మిగిలిన రెండు గ్రంథములకు కూడ మాన్యములై ఉన్నవి.
సమస్తవేదాంతగ్రంథ సముదాయమునకు తలమానికములు ఉపనిషత్తులు. సాక్షాత్తుగావేదరాశికి శిరోభాగములు ఇవి.
సంసారబీజవిశరణం, బ్రహ్మజ్ఞానబోధనం, సంసారబంధాన్ని శిథిలం చేయటం ఉపనిషత్తుల మూడు ప్రధాన లక్ష్యాలని ఆచార్యభగవత్పాదుల ఉపదేశం.
వీటిలో సంసార బీజ విశరణము అంటే మాయా రూపమైన సంసారము యొక్క బీజమును నిర్మూలనము చేయుట.
బ్రహ్మ జ్ఞాన బోధనము అంటే కనబడే ప్రపంచములన్నింటిలో ఏకమాత్ర సత్యరూపమైనపరబ్రహ్మము అంటే ఏమిటో తెలియజెప్పుట.
సంసార బంధాన్ని శిథిలం చేయటం. అంటే కనబడని ఏ కర్మ బంధమువల్ల అశాశ్వతమైన సంసారము నిజముగా భ్రమించబడి జీవితమును సుఖ దుఃఖమయము చేయుచున్నదో ఆ కర్మ బంధమునకే సంసారబంధమని పేరు. దానిని శిథిలము చేయునది ఉపనిషత్తు అని గ్రహించవలెను.
వేదశిరోభాగములుగా కీర్తించబడే ఉపనిషత్తులలో ఈశ, కేన, కఠ, ప్రశ్న ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులకు చాలాప్రాధాన్యమున్నది.ఈ పది ఉపనిషత్తులకు, వీటితో పాటు శ్వేతాశ్వతరోపనిషత్తుకు కూడా శ్రీ భగవత్పాదులు భాష్యమును రచించుటచేత ఈ ఉపనిషత్తులకు ప్రాశస్త్యము లభించినది. ఇలా లోక ప్రసిద్ధి పొందిన ఉపనిషత్తులు కాగా ఉపనిషత్తులు అసలు ఎన్ని అన్న విషయం లో సంఖ్యాభేదం కనబడుతోంది.
ఉపనిషత్తుల సంఖ్య:
ఒక వేదమంటే మంత్రభాగము. మంత్రభాగమంటే సంహితా, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అని శిష్టప్రసిద్ధము. అయితే వేద శాఖలు పతంజలి మహర్షి సమయం లో 1131 ఉండేవట. కనుక ఆనాడు 1131 సంహితలు, 1131 బ్రాహ్మణములు, 1131ఆరణ్యకములు, 1131 ఉపనిషత్తులు ఉండాలి. కానీ నేడు పూర్వము చెప్పిన ప్రకారము 11 ఉపనిషత్తులు అని, 108 ఉపనిషత్తులు అని, 258 ఉపనిషత్తులు అని, 500 ఉపనిషత్తులని అచ్చులో లభించుచున్న ప్రకారము ఉపనిషత్తుల సంఖ్యలో భేదము కనబడుచున్నది. అయితే 108 ఉపనిషత్తులకు లోక ప్రసిద్ధి ఉండటం వల్ల వాటిని ఆస్తికపాఠకలోకానికి, తత్త్వచింతనాపరుల దగ్గరకు తేవాలని ఈ ప్రయత్నం.
- 1. ఈశావాస్యోపనిషత్తు
- 2. కేనోపనిషత్తు
- 3. కఠోపనిషత్తు
- 4. ప్రశ్నోపనిషత్తు
- 5. ముండకోపనిషత్తు
- 6. మాండూక్షోపనిషత్తు
- 7. తైత్తిరీయోపనిషత్తు
- 8. ఐతరేయోపనిషత్తు
- 9. ఛాందోగ్యోపనిషత్తు
- 10. బృహదారణ్యకోపనిషత్తు
- 11. శ్వేతాశ్వతరోపనిషత్తు
- 12. బ్రహ్మబిందూపనిషత్తు
- 13. కైవల్యోపనిషత్తు
- 14. జాబాలోపనిషత్తు
- 15. హంసోపనిషత్తు
- 16. ఆరుణికోపనిషత్తు
- 17. గర్భోపనిషత్తు
- 18. మహానారాయణోపనిషత్తు
- 19. పరమహంసోపనిషత్తు
- 20. బ్రహ్మోపనిషత్తు
- 21. అమృతనాదోపనిషత్తు
- 22. అథర్వశిరోపనిషత్తు
- 23. అథర్వశిఖోపనిషత్తు
- 24. కౌషీతకీబ్రాహ్మణోపనిషత్తు
- 25. బృహజ్జాబాలోపనిషత్తు
- 26. నృసింహపూర్వతాపిన్యుపనిషత్తు
- 27. నృసింహోత్తరతాపిన్యుపనిషత్తు
- 28. కాలాగ్నిరుద్రోపనిషత్తు
- 29. మైత్రేయ్యుపనిషత్తు
- 30. సుబాలోపనిషత్తు
- 31. క్షురికోపనిషత్తు
- 32. సర్వసారోపనిషత్తు
- 33. నిరాలంబోపనిషత్తు
- 34. శుకరహస్యోపనిషత్తు
- 35. వజ్రసూచికోపనిషత్తు
- 36. తేజోబిందూపనిషత్తు
- 37. నాదబిందూపనిషత్తు
- 38. ధ్యానబిందూపనిషత్తు
- 39. బ్రహ్మవిద్యోపనిషత్తు
- 40. యోగతత్త్వోపనిషత్తు
- 41. ఆత్మబోధోపనిషత్తు
- 42. నారదపరివ్రాజకోపనిషత్తు
- 43. త్రిశిఖీబ్రాహ్మణోపనిషత్తు
- 44. సీతోపనిషత్తు
- 45. యోగచూడామణ్యుపనిషత్తు
- 46. నిర్వాణోపనిషత్తు
- 47. మండలబ్రాహ్మణోపనిషత్తు
- 48. దక్షిణామూర్తి ఉపనిషత్తు
- 49. శరభోపనిషత్తు
- 50. స్కందోపనిషత్తు
- 51. త్రిపాద్విభూతిమహానారాయణోపనిషత్తు
- 52. అద్వయతారకోపనిషత్తు
- 53. రామరహస్యోపనిషత్తు
- 54. రామపూర్వతాపిన్యుపనిషత్తు
- 55. రామోత్తరతాపిన్యుపనిషత్తు
- 56. వాసుదేవోపనిషత్తు
- 57. ముద్గలోపనిషత్తు
- 58. శాండిల్యోపనిషత్తు
- 59. పైజ్ఞలోపనిషత్తు
- 60. భిక్షుకోపనిషత్తు
- 61. మహోపనిషత్తు
- 62. శారీరకోపనిషత్తు
- 63. యోగశిఖోపనిషత్తు
- 64. తురీయాతీతోపనిషత్తు
- 65. సన్న్యాసోపనిషత్తు
- 66. పరమహంసోపనిషత్తు
- 67. అక్షమాలికోపనిషత్తు
- 68. అవ్యక్తోపనిషత్తు
- 69. ఏకాక్షరోపనిషత్తు
- 70. అన్నపూర్ణోపనిషత్తు
- 71. సూర్యోపనిషత్తు
- 72. అక్ష్యుపనిషత్తు
- 73. అధ్యాత్మోపనిషత్తు
- 74. కుండికోపనిషత్తు
- 75. సావిత్ర్యుపనిషత్తు
- 76. ఆత్మోపనిషత్తు
- 77. పాశుపతబ్రహ్మోపనిషత్తు
- 78. పరబ్రహ్మోపనిషత్తు
- 79. అవధూతోపనిషత్తు
- 80. త్రిపురాతాపిన్యుపనిషత్తు
- 81. దేవ్యుపనిషత్తు
- 82. త్రిపురోపనిషత్తు
- 83. కఠరుద్రోపనిషత్తు
- 84. భావనోపనిషత్తు లేక శ్రీచక్రోపనిషత్తు
- 85. రుద్రహృదయోపనిషత్తు
- 86. యోగకుండలిన్యుపనిషత్తు
- 87. భస్మజాబాలోపనిషత్తు
- 88. జాబాలదర్శనోపనిషత్తు
- 89. శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్తు (గణపత్యుపనిషత్తు)
- 90. రుద్రాక్షజాబాలోపనిషత్తు
- 91. తారసారోపనిషత్తు (శుక్లయజుర్వేదీయ)
- 92. మహావాక్యోపనిషత్తు
- 93. పంచబ్రహ్మోపనిషత్తు
- 94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు
- 95. గోపాలపూర్వతాపిన్యుపనిషత్తు
- 96. గోపాలోత్తరతాపిన్యుపనిషత్తు
- 97. శ్రీకృష్ణోపనిషత్తు
- 98. యాజ్ఞవల్క్యోపనిషత్తు
- 99. వరాహోపనిషత్తు
- 100. శాట్యాయనీయోపనిషత్తు
- 101. హయగ్రీవోపనిషత్తు
- 102. శ్రీదత్తాత్రేయోపనిషత్తు
- 103. గరుడోపనిషత్తు
- 104. జాబాల్యుపనిషత్తు
- 105. సౌభాగ్యలక్ష్య్ముపనిషత్తు
- 106. శ్రీసరస్వతీరహస్యోపనిషత్తు
- 107. బహ్వృచోపనిషత్తు
- 108. ముక్తికోపనిషత్తు
ఈ ఉపనిషత్తులన్నీ ప్రాచీనములే అనటానికి దృఢమైన నిదర్శనములు లేవు. కానీ ఈ ఉపనిషత్తులన్నీ నిత్య, సత్య స్వరూపమైన పరబ్రహ్మ తత్త్వమును నిరూపించుటకు సిద్ధమైనవే. అయితే ప్రాసంగికంగా కనబడే ఏఏ జగత్తు యొక్క వివిధ తత్త్వ భూమికల గురించి, విద్య, అవిద్యల తీరుతెన్నుల గురించి, విస్తృత వివరణ లభిస్తుంది. సంపదలు, శక్తి, విశ్వచైతన్యము, పంచభూతములు, సృష్టి ఆవిర్భావ, పరిణామ, వికాస, విపత్తి, లయాదుల గురించి, జీవాజీవ భేద పర్యాలోచన గురించి, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం మొదలగు అంశాల స్వరూప, స్వభావాల గురించి కూలంకషమైన చర్చ, జనన మరణ చక్రం లో జీవుని యాత్ర, తల్లి కడుపులో చేరిన దగ్గర నుంచి ఊపిరి పోసుకుని బయటకు వచ్చేవరకు మాతృ గర్భంలో పొందే పరిణామ క్రమం గురించి ఆశ్చర్య కరమైన విశేషాలు ఎన్నో ఈ ఉపనిషత్తులలో కనబడుతాయి.
ఆధునిక విజ్ఞానజగత్తు అబ్బురపడే విశేషాలు ఎన్నో ఈ ఉపనిషత్తులలో గోచరిస్తాయి. మానవ సమాజం ఎదుర్కునే సామాజిక, వైయక్తిక, మానసిక, బౌద్ధిక సమస్యలకు అన్నింటికీ స్పష్టమైన పరిష్కారాలు ఏఏ గ్రంథరాశిలో లభిస్తాయి. ఉపనిషత్తులు, మోక్షమార్గాన్ని చూపటమే కాక విశ్వమానవ సోదర భావాన్ని, విశ్వ శాంతిని సాధించటానికి అవసరమైన పారమార్థిక భావనలను చక్కగా అందజేస్తున్నవి.
ప్రస్తుత గ్రంథం లో 108 ఉపనిషత్తులనూ సంస్కృతమూలంగా అందిస్తూ వాటితో పాటు ప్రతి ఉపనిషత్తు సారాంశాన్ని తెలుగు భాషలో ఆ ఉపనిషత్తుకు ముందు జోడించి అందించే ప్రయత్నం జరిగింది. ఈ ఉపనిషత్తుల పరిచయాన్ని ప్రసిద్ధులైన వేద, వేదాంత పండితులు అందించారు.
కనుక ఈ ఉపనిషత్తులను పారాయణం చేయడం కూడా సకల శ్రేయస్సులను, ప్రేయస్సును కూడా అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ ఉపనిషత్ గ్రంథ రూపకల్పనలో శిల్పులు
ఆంధ్రదేశంలో లింగమేనని వంశకీర్తి ప్రతిష్ఠలు లోకప్రసిద్ధములు. విజయవాడ – గుంటూరు నగరాల మధ్యలో మంగళగిరి దాటిన తరువాత నంబూరుకు చేరువలో శ్రీదశావతారవేంకటేశ్వరస్వామివారి దివ్యమైన ఆలయనిర్మాణంచేసి శ్రీ లింగమనేనిపూర్ణభాస్కరరావు గారు శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఎనలేని అనుగ్రహానికి పాత్రులైనారు. నిత్యం లక్షలాది భక్తులకు ఆ పరమ పురుషుని శ్రీనివాసుని దివ్యదర్శనభాగ్యం లభిస్తున్నది అంటే దానికి కారణ భూతులు శ్రీ పూర్ణభాస్కరరావు గారు.
అలాగే లింగమనేని ఎస్టేట్స్ అనే మహా భవననిర్మాణసంస్థ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రసిద్ధ నగరాలలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి ఎందరో గృహస్థుల స్వంత ఇంటి కలలను సాకారం చేశారు. ఇలా వేలాది మంది ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. వారి సంతానమూ వారికి సమానమైన హృదయం కలిగిన వారే.
ఇలా శ్రీ పూర్ణభాస్కరరావు గారి మహత్తరమైన ఆశయాలలో ఒకటి నూట ఎనిమిది ఉపనిషత్తులను ప్రతి ఉపనిషత్తుకు ముందు ఉపోద్ఘాతాలతో ఒక మహా గ్రంథంగా పండితుల ద్వారా సంకలనం చేసి భక్తులకు, ఆస్తిక లోకానికి, చేరువలోకి తెచ్చి వారిలోని లోకాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం. ఆ ప్రయత్నంలోనే ది.16-09-2016 న శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకటశాస్త్రి ఘనపాఠీ కలిసి శ్రీ పూర్ణభాస్కరరావుగారిని కలిసి మాట్లాడు తున్నపుడు ఈ మహా గ్రంథ నిర్మాణ యజ్ఞానికి శ్రీకారం చుట్టడమైంది.
ఆచార్య రాణి సదాశివమూర్తి
ఉపకులపతి, శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వ విద్యాలయం, తిరుపతి
బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకటశాస్త్రి ఘనపాఠీ
శ్రీ లింగమనేని పూర్ణ భాస్కరరావు గారు, వారి సతీమణి శ్రీమతి స్వర్ణకుమారి
వెనువెంటనే 108 ఉపనిషత్తుల మూలాన్ని సిద్ధం చేసుకున్నాము. అందుకు ఒక నెల రోజులు పట్టింది. ఆ తరువాత ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన కొందరు పండితులను ఎంపిక చేసుకుని వారికి ఈ 108 ఉపనిషత్తులను ఆయా ఉపనిషత్తుల పరిమాణాన్ని బట్టి విభజన చేసి ఇచ్చి వాటికి ఉపోద్ఘాతములను వ్రాయమని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ఉపోద్ఘాతములను వ్రాయటంతోపాటు సిద్ధపరచిన ఉపనిషత్తుల మూలంలో టంకణ దోషాలు ఏమైనా ఉంటే పరిష్కరించమనికూడా అభ్యర్థించాము. అలా వారి సహకారంతో ఉపనిషత్తులు అన్నింటికీ ఉపోద్ఘాతములు సిద్ధమైనవి. మంత్రములలోని టంకణ దోషములు కూడా నివారింపబడినవి. ఇలా మనకు ఉపనిషత్తులను సిద్ధము చేసి ఇచ్చిన వారి వివరములు ఈ విధంగా పొందుపరచడమైనది.
ఏ ఏ ఉనిషత్తులు ఎవరెవరికి
ఉనిషత్తులు | ఉపోద్ఘాతము రాసిన వారి పేరు |
---|---|
ఈశ, కేన, కఠ, అవ్యక్తోపనిషత్తులు(1,2,3, 68) | డా. అంబడిపూడి వేంకట రాధేశ్యామ్ గారు |
ప్రశ్న, ముండక, ఐతరేయోపనిషత్తులు (4,5,8) | డా. ఆకెళ్ళ విభీషణశర్మ గారు |
మాండూక్య, తైత్తిరీయ ఉపనిషత్తులు (6,7) | డా. దువ్వూరి ఫణియజ్ఞేశ్వర యాజులు గారు |
ఛాందోగ్య, శ్రీరామపూర్వతాపిన్యు, శ్రీరామోత్తరతాపిన్యోపనిషత్తులు (9, 54, 55) | ఆచార్య రాణిసదాశివమూర్తి గారు |
బృహదారణ్యకోపనిషత్తు (10) | డా. ప్రవా రామకృష్ణ సోమయాజి శర్మ గారు |
శ్వేతాశ్వతర, బ్రహ్మబిందు, కైవల్య, జాబాల, హంస, ఆరుణిక, గర్భ, మహానారాయణ, పరమహంస (11-19) | డా. కోగంటి రామానుజాచార్యులు గారు |
బ్రహ్మ, అమృతనాద, అధర్వశిర, అధర్వశిఖా, కౌషీతకీ, బృహజ్జాబాలా, నృసింహపూర్వ, నృసింహఉత్తర, కాలాగ్నిరుద్ర (20-28) | డా. పీసపాటి వేంకటనాగ నరసింహ మారుతి గారు |
మైత్రాయణి, సుబాల, క్షురిక, సర్వసార, నిరాలంబ, శుకరహస్య, వజ్రసూచిక, తేజోబిందు, నాదబిందు (29-37) | డా. పైడిపాటి వేంకటా చలపతి గారు |
ధ్యానబిందు, బ్రహ్మవిద్య, యోగతత్త్వ, ఆత్మబోధ, నారదపరివ్రాజక, త్రిశిఖీబ్రాహ్మణ, సీత, యోగచూడమణి, నిర్వాణ, మండలబ్రాహ్మణ (38-47) | డా. కుప్పా నరసింహమూర్తి గారు |
దక్షిణామూర్తి, శరభ, స్కంద, త్రిపాద్విభూతిమహా నారాయణ, రామఅద్వయతారక, రామరహస్య, వాసుదేవ, ముద్గల (48-53, 56,57) | బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట శాస్త్రి గారు |
శాండిల్య, ఫైఙ్గల, భిక్షుక, మహా, శారీరక, యోగశిఖా, తురీయాతీత, సన్న్యాస, పరమహంస పరివ్రాజక, అక్షమాలికోపనిషత్తులు (58-67) | బ్రహ్మశ్రీ కపిలవాయి రైవత గారు |
అక్ష్యోపనిషత్తు (72) | బ్రహ్మశ్రీ ముదిగొండ వేంకట జయరామశర్మ గారు |
ఏకాక్షర, అన్నపూర్ణ, సూర్య, అధ్యాత్మ, కుండిక, సావిత్రి, ఆత్మ, పాశుపతబ్రహ్మోపనిషత్తులు (69-71, 73-77) | డా. రామనాథపరిమి గారు |
పరబ్రహ్మ, అవధూత, త్రిపురతాపి, దేవి, త్రిపురోప, కఠరుద్ర, భావన, రుద్రహృదయ, యోగకుండలిని, భస్మజాబాల్యూపనిషత్తులు (78-87) యాజ్ఞవల్క్య, వరాహ, శాట్యాయనీ, హయగ్రీవ, శ్రీదత్తాత్రేయ, గారుడ, జాబాలి, సౌభాగ్య, సరస్వతీ, బహ్వృచీ, ముక్తికో (98-108) | డా. కరి పురుషోత్తమాచార్యులు గారు |
జాబాలదర్శన, శ్రీగణపతి, రుద్రాక్షజాబాల, తారసార, మహావాక్య, పంచబ్రహ్మ, ప్రాణాగ్నిహోత్ర, గోపాలపూర్వ, గోపాలఉత్తర, శ్రీకృష్ణ (88-97) | డా. కొండూరి తిరువేంగళ రాఘవన్ గారు |
లోకానికి ఆధ్యాత్మమార్గాన్ని బోధించే ఈ మహాగ్రంథాన్ని రూపొందించాలనే మహత్తర సంకల్పాన్ని బూనిన శ్రీ లింగమనేని పూర్ణభాస్కరరావు గారు, వారి కుటుంబ సభ్యులందరూ పూర్ణాయుర్దాయవంతులై, ఆరోగ్యైశ్వర్యాదులతో, ఆచంద్రార్కం పుత్ర- పౌత్రాభివృద్ధితో, గణనీయమైన కీర్తి ప్రతిష్ఠలతో, ఆస్తిక ధర్మ పరాయణులై ఆ శ్రీనివాసుని పరిపూర్ణ కృపా కటాక్షములకు పాత్రులు కావాలి.
అలాగే ఈ మహాయజ్ఞంలో ఆయా ఉపనిషత్తులకు ఉపోద్ఘాతములను వ్రాసిన పండిత వర్యులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు.
ఈ మహద్గ్రంథ నిర్మాణంలో భాగంగా టంకణము చేసి, తప్పోప్పులు సరిచూచి సరియైన సమయానికి సిద్ధపరచిన ప్రతిని అందజేసిన పరిశోధన ప్రకాశన విభాగ సిబ్బంది డా. ఎమ్. సూర్యనారాయణ, డా. పరాశరం వేంకట హనుమత్ ప్రసాద్, డా. ఎన్.వి. శ్రీనివాసమూర్తి, డా. యడవల్లి లక్ష్మీశ్రీకాంత్ శర్మ, శ్రీమతి ఎమ్. స్వాతి, శ్రీ ఎన్. జయచంద్ర, శ్రీమతి సి. సుజాత, కుమారి ఎమ్. గీతాంజలి, శ్రీ వై.వి. శివకుమార్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
తగు విధంగా సాంకేతిక సహాయాన్ని అందించి ఈ బృహద్గ్రంథాన్ని ఒక వైద్యుత గవేషణ ప్రక్రియలోకి తీసుకువచ్చినటువంటి రాష్ర్టీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో Systems Analysist గా పనిచేస్తున్న డా. శ్రీమతి కె. సుజనీ గారికి అభినందన సహిత కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము.
ఈ ఉద్గ్రంథనిర్మాణానికి సారథులుగా, ఈ గ్రంథ సంపాదకులుగా వ్యవహరించుటకు మాకు అనగా ఆచార్య రాణి సదాశివమూర్తి మరియు మంగిపూడి వేంకటశాస్త్రి నామధేయులకు అవకాశం ఇచ్చి ఈ గ్రంథముద్రణకు, మరియు పండిత పారితోషికములకు తగిన ద్రవ్య సదుపాయమును సమకూర్చిన వదాన్య శేఖరులైన శ్రీ లింగమనేని పూర్ణ భాస్కరరావు గారికి కృతజ్ఞతలు.